Srinivas Ganjivarapu

ఏదైనా మంచి సినిమా చూస్తున్నప్పుడు అందులోని కథ, కథనం మనసుకు హత్తుకుంటే.. పాత్రధారుల ప్రతిభాత్మక నటన దానికి తోడైతే, కళ్ళు చెమర్చడం సహజం. సాధారణంగా రెండున్నర గంటల చిత్రంలో ఇలాంటి భావోద్వేగ సన్నివేశాలు ఒకట్రెండు చోట్ల మాత్రమే కనిపిస్తాయి. కానీ, విజయ్ సేతుపతి, మాస్టర్ సాయి పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బత్తా’ సినిమా చూస్తున్నంత సేపు కళ్ళు చెమర్చుతూనే ఉంటాయి, గుండె బరువెక్కిపోతూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇంతటి మానవీయ స్పృహ కలిగిన చిత్రం రావడం అరుదు. వినోదం పంచడంతో పాటు, మనిషి అంతరంగంలోకి ప్రయాణించి, మూలాలను తట్టిలేపే ఒక దృశ్య కావ్యం ఈ బత్తా.

భయానికి, మానవత్వానికి మధ్య సాగే అంతరంగిక మథనం

1986 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఒక వింటేజ్ లోకంలోకి తీసుకెళ్తుంది. ఊరందరికీ సింహస్వప్నంగా మారిన భయానక రౌడీ భక్తవత్సలం అలియాస్ ‘బత్తా’ పాత్రలో విజయ్ సేతుపతి కనిపిస్తారు. రక్తం మరిగించే హింస, ఎదురులేని ఆధిపత్యం, నిర్దయ అతని ప్రపంచం. సమాజం భయపడే ఆ రాక్షసత్వపు ముఖం వెనుక ఓ నిస్సహాయమైన, ఆకలితో అణగారిపోయిన నిజమైన మనిషి తాలూకు జాడలను దర్శకుడు ఆవిష్కరించారు. అనుకోని పరిస్థితుల్లో ఆ ఊరికి చెందిన భయస్తుడైన, మూడో తరగతి చదివే పిల్లవాడు శబరి కారణంగా బత్తా ఒక స్కూలు బాత్‌రూమ్‌లో బందీ అవుతాడు. బయట బత్తా కోసం అందరూ కంగారు పడుతుంటే, లోపల ఆ చిన్నారి శబరి తన భయం కొద్దీ కేవలం రస్కులు మాత్రమే అందిస్తూ ఉంటాడు.

ఆ ఇరుకైన నాలుగు గోడల మధ్య, ఆ ఏకాంతంలో ఆ గ్యాంగ్‌స్టర్ అహంకారం, భయపెట్టే స్వభావం నెమ్మదిగా కరిగిపోతాయి. బాహ్య ప్రపంచపు హోరుకు దూరంగా, ఆ చిన్న గదిలో గడిపిన అనుభవం బత్తా జీవితాన్ని మార్చివేస్తుంది. తన గతాన్ని, తాను ఇతరులతో ప్రవర్తించిన తీరును, ముఖ్యంగా తన భార్య కన్నిమ పట్ల తను వ్యవహరించిన కఠినమైన తీరును బత్తా సమీక్షించుకోవడం మొదలుపెడతాడు. ఒక హింసాత్మక ప్రవృత్తి గల వ్యక్తి తన అంతరాత్మను తానే ప్రశ్నించుకునే క్రమం హృద్యంగా ఉంటుంది. ఈ అనూహ్య బంధం వారి జీవితాలను ఎలా మార్చింది, ఆ తర్వాత సమాజంలో తన స్థానాన్ని బత్తా ఎలా పునఃసమీక్షించుకున్నాడనేదే ఈ చిత్ర కథాంశం తాలూకు ఆత్మ.

ప్రాణం పోసిన పాత్రలు

విజయ్ సేతుపతి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. హావభావాలతో పాటు, కళ్లలోని నిస్సహాయత, పశ్చాత్తాపంతో ఆయన ఈ పాత్రకు జీవం పోశారు. ఒకవైపు క్రూరమైన రౌడీగా భయపెడుతూనే, మరోవైపు ఒంటరితనం, ఆకలితో అల్లాడిపోయిన సగటు మనిషిగా, ఆ తర్వాత తన తప్పులను తెలుసుకొని పరివర్తన చెందే క్రమంలో నటన పరంగా ఇంకో మెట్టు ఎక్కారు. ముఖ్యంగా ఆ బాత్‌రూమ్ బందీ సమయంలో ఆయన పడే అంతర్మథనం తెరపై కనిపిస్తుంటే ప్రేక్షకులు ఆ పాత్రతో మమేకమైపోతారు. క్లైమాక్స్ ముందు వచ్చే భావోద్వేగ సన్నివేశంలో ఆయన నటన గుండెల్ని తాకుతుంది.. కళ్ళు ఆయాచితంగా చెమర్చుతాయి.

విజయ్ సేతుపతి ఎదురుగా చిన్న పిల్లాడు మాస్టర్ సాయి పృథ్వీరాజ్ పరిణతితో కనబరిచిన అభినయం గుండెలను పిండేస్తుంది. భయం, అమాయకత్వం కలగలిపిన ఆ చిన్నారి హావభావాలు సినిమాకు ప్రాణం పోశాయి. బత్తా క్రూరత్వాన్ని చూసి వణికిపోతూనే, క్రమంగా అతనితో ఏర్పరచుకునే మానసిక అనుబంధాన్ని ఆ చిన్నారి ప్రదర్శించిన తీరు భలే అనిపిస్తుంది. అలాగే బత్తా భార్యగా కన్నిమ పాత్రలో నటించిన లిజోమోల్ జోస్ నటన సహజంగా, హత్తుకునేలా సాగుతుంది. విజయ్ సేతుపతితో ఆమె మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకుడిని ఎమోషనల్ లోతుల్లోకి తీసుకెళ్తాయి. మాటల కంటే మౌనమే ఎక్కువ భావాన్ని పలికించారు వారు.

దర్శక ప్రతిభకు జేజేలు

దర్శకుడు బాలాజీ ధరణీతరణ్ ఎంచుకున్న పాయింట్ సాహసోపేతమైనది. ఒక గ్యాంగ్‌స్టర్ కథను చెప్పడానికి ఒక స్కూలు బాత్‌రూమ్‌ను కేంద్రంగా చేసుకొని, అక్కడే అతని పరివర్తనను చూపించడం ఆయన ఊహాశక్తికి నిదర్శనం. సినిమా ఆసాంతం మనిషిలోని క్రూరత్వాన్ని, అమాయకత్వాన్ని బ్యాలెన్స్ చేస్తూనే, మనసును హత్తుకునే మానవీయ స్పర్శను కోల్పోకుండా చక్కగా నడిపించారు. సాయి అభ్యంకర్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాల తీవ్రతను పెంచి, గుండె లోతుల్లోకి తాకేలా చేస్తుంది. 1980ల నాటి మద్రాస్ వాతావరణాన్ని ఆర్ట్ డైరెక్షన్, కెమెరా వర్క్ పాత జ్ఞాపకాల్లా, సహజంగా ప్రతిబింబించాయి.

అయితే సినిమా ప్రారంభంలో కథనం కొంచెం నెమ్మదిగా సాగుతుంది..అలాగే క్లైమాక్స్ వద్ద బత్తా ఆ బాత్‌రూమ్‌లోకి వెళ్లడానికి దారితీసిన నేపథ్యం కొద్దిగా ఊహాజనితంగా అనిపించినప్పటికీ, ఆ తర్వాత తెరపై పండే భావోద్వేగ తీవ్రత ఆ చిన్న లోపాన్ని మర్చిపోయేలా చేస్తుంది. హింసను పెద్దగా హైలైట్ చేయకుండా, హింస వెనుక ఉండే మానసిక క్షోభను, పరివర్తనను చూపడంలో దర్శకుడు విజయం సాధించారు.

గుండెలను మెలిపెట్టే దృశ్య కావ్యం

‘బత్తా’ మానవ సంబంధాల లోతులను, పశ్చాత్తాపాన్ని, చిన్నపిల్లల అమాయకత్వాన్ని, మారుతున్న కాలంలో మనిషి కోల్పోతున్న మానవత్వాన్ని అద్దం పట్టే ఒక అందమైన దృశ్యకావ్యం. పవర్‌ఫుల్ యాక్షన్ హింసాత్మక సినిమాల హోరులో, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, నిదానంగా మన గుండెల్లో గూడు కట్టుకునే సినిమా ఇది. సినిమా ముగిసినా, థియేటర్ నుంచి బయటకు వచ్చినా ఆ పాత్రలు, ఆ బాత్‌రూమ్ గోడల మధ్య సాగిన మౌన సంభాషణలు..చివరగా బత్తా గాన మాధుర్యం మన వెంటే నడుస్తుంటాయి.

ఇంత గొప్ప అనుభూతి కలిగించిన చిత్రం అందించిన ‘బత్తా’ మూవీ టీమ్‌కు ధన్యవాదాలు!