నీలి విషాదం నుంచి ఖేడా విప్లవం వరకూ ..
ఈ నేల మీద ఏ మహానాయకుడూ ఆకాశం నుంచి ఊడిపడలేదు; రాత్రికి రాత్రే చరిత్రను శాసించనూ లేదు. ఒక సాధారణ న్యాయవాది మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ, జాతి గర్వించే ‘మహాత్ముడు’గా రూపాంతరం చెందడం వెనుక ఎన్నో ఏళ్ల నిశ్శబ్ద సాధన, ప్రజల ఆక్రందనలను గుండెల్లో దాచుకున్న అగ్నిపరీక్ష ఉంది. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత భారత గడ్డపై ఆయన వేసిన తొలి మూడు అడుగులు..చంపారన్, అహ్మదాబాద్, ఖేడా..ఆయనను ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిపాయి. అణగారిన వర్గాల కన్నీళ్లను తుడుస్తూ, సత్యం..అహింసలను తిరుగులేని ఆయుధాలుగా మలిచి గాంధీజీ మహాత్ముడిగా ఆవిర్భవించిన చారిత్రక పరిణామమిది.
నీలి రంగు వెనుక బానిసత్వపు సంకెళ్లు
సంస్కృతంలో ‘నీల’ అనీ, గ్రీకులో ‘ఇండికాన్’ అనీ పిలిచే మొక్కే ఇండిగోఫెరా టింక్టోరియా. దీని ఆకుల నుంచి తీసే సహజ సిద్ధమైన నీలిరంగు గాఢంగా, ఉతికినా వెలసిపోని కాంతితో ఉండేది. యూరప్‌లో అప్పటివరకు వాడుతున్న వోడ్ మొక్క రంగు తేలిపోవడంతో, భారతీయ ఇండిగోకు ప్రపంచ విపణిలో బంగారమంత విలువ దక్కింది. 17వ శతాబ్దంలో ఈస్టిండియా కంపెనీ భారతదేశంలో వేళ్లూనుకోవడానికి ఈ ‘నీలి బంగారం’ ఒక ప్రధాన కారణమైంది. పారిశ్రామిక విప్లవంతో మాంచెస్టర్ వస్త్ర మిల్లులు వెలిశాక, బ్రిటన్ దిగుమతి చేసుకునే నీలిమందులో ఎనభై ఐదు శాతానికి పైగా బెంగాల్, బీహార్ నుంచే సరఫరా అయ్యేది.
ఈ వ్యాపార దాహమే తెల్లదొరలను క్రూరమైన ప్లాంటర్లుగా మార్చింది. వారు రైతులను కట్టడి చేయడానికి ప్రవేశపెట్టినదే ‘తీన్‌కథియా’ పద్ధతి. ఈ నిబంధన ప్రకారం ప్రతి రైతు తనకున్న ప్రతి ఇరవై కట్టాల భూమిలో ఖచ్చితంగా మూడు కట్టాల అత్యంత సారవంతమైన నేలలో నీలిమందే పండించాలి. ఆహార పంటలు వేసుకునే భూమిని తెల్లదొరలు బలవంతంగా లాక్కోవడంతో గ్రామాలు ఆకలి కేకలతో అల్లాడిపోయాయి. పంట చేతికి వచ్చాక కనీస మార్కెట్ ధరలో నాలుగో వంతు కూడా ఇవ్వకుండా రైతులను నిలువునా దోచుకున్నారు. 1859లో బెంగాల్లో ‘నీల్ విద్రోహ్’ తిరుగుబాటు రావడంతో ప్లాంటర్లు తమ కేంద్రాన్ని బీహార్‌లోని చంపారన్‌కు మార్చి మరింత అణచివేతకు పాల్పడ్డారు.
కృత్రిమ రంగు పతనం .. రైతులపై పగబట్టిన తెల్లదొరలు
ప్రకృతి ఇచ్చిన నీలి మొక్కపై బ్రిటిష్ వారి గుత్తాధిపత్యాన్ని ఆధునిక రసాయన శాస్త్రం దెబ్బతీసింది. 1880లో జర్మన్ రసాయన శాస్త్రవేత్త అడాల్ఫ్ వాన్ బేయర్ కృత్రిమ సింథటిక్ ఇండిగోను కనుగొనగా, 1897 నాటికి జర్మనీకి చెందిన BASF సంస్థ దీని భారీ ఉత్పత్తిని ప్రారంభించింది. దాంతో భారతీయ నీలిమందు సాగు పదిహేడు లక్షల ఎకరాల నుంచి కొద్ది కాలంలోనే లక్షన్నర ఎకరాలకు పడిపోయింది. ఎగుమతులు దాదాపు పందొమ్మిది వేల టన్నుల నుంచి వెయ్యి టన్నుల దిగువకు చేరాయి.
నష్టాలతో దివాలా తీసిన తెల్ల ప్లాంటర్లు, ఆ భారాన్ని అమాయక రైతులపై మోపారు. బానిస ఒప్పందాల నుంచి విముక్తి కల్పిస్తామంటూ ‘తావాన్’ పేరిట ఏకమొత్తంగా భారీ నష్టపరిహారాలు పిండుకున్నారు. అలాగే ‘షరహ్ బేషీ’ పేరుతో కౌలు మొత్తాన్ని నలభై నుంచి ఎనభై శాతానికి పెంచారు. దాదాపు నలభైకి పైగా అక్రమ పన్నులు విధించి, కొరడా దెబ్బలతో రైతుల ఆత్మగౌరవాన్ని కాలరాశారు.
గాంధీ ‘ చంపారన్ ‘ సత్యాగ్రహం .. తొలి శాసనోల్లంఘన గర్జన
ఈ అణచివేతను భరించలేకపోయిన రాజ్ కుమార్ శుక్లా అనే సామాన్య రైతు చంపారన్ సమస్యను జాతీయ స్థాయికి చేర్చారు. ఆయన 1916 లక్నో కాంగ్రెస్ మహాసభల్లో గాంధీజీని కలిసి, తమ రక్తపు కన్నీళ్లను స్వయంగా చూడాలని ప్రాధేయపడ్డారు. శుక్లా సంకల్పాన్ని చూసి చలించిన గాంధీజీ, 1917 ఏప్రిల్ 10న బిహార్‌లోని చంపారన్ జిల్లా కేంద్రమైన మోతీహరికి చేరుకున్నారు. ఆయన వెంట బాబూ రాజేంద్ర ప్రసాద్, ఆచార్య జేబీ కృపలానీ, బ్రజ్‌కిషోర్ ప్రసాద్, అనుగ్రహ నారాయణ్ సిన్హా వంటి యువ న్యాయవాదుల బృందం నడిచింది.

మోతీహరిలో అడుగుపెట్టగానే జిల్లా మేజిస్ట్రేట్ నుంచి సెక్షన్ 144 కింద జిల్లాను విడిచి వెళ్లిపోవాలని బహిష్కరణ నోటీసు వచ్చింది. దానికి సమాధానంగా, నిస్సహాయులైన రైతుల ఆక్రందనలను వినడమే తన మానవతా కర్తవ్యమని, ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ విధించే ఏ శిక్షనైనా అనుభవించడానికి సిద్ధమని గాంధీజీ ప్రకటించారు. ఏప్రిల్ 18న వేలాది మంది రైతులు కోర్టును చుట్టుముట్టడంతో తెల్ల పాలకులు కేసును ఉపసంహరించుకోక తప్పలేదు. దాదాపు ఎనిమిది వేల మంది రైతుల వాంగ్మూలాలను శాస్త్రీయంగా నమోదు చేసిన గాంధీజీ, బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి 1918లో చంపారన్ వ్యవసాయ చట్టం ద్వారా తీన్‌కథియా పద్ధతిని శాశ్వతంగా రద్దు చేయించారు. భారతదేశంలో అహింసాత్మక శాసనోల్లంఘన సాధించిన తొలి విజయమిది.
అహ్మదాబాద్ మిల్లు కార్మికుల పోరాటం ..గాంధీ తొలి నిరాహార దీక్ష
చంపారన్ విజయం ముగిసిన వెంటనే 1918 ప్రారంభంలో గాంధీజీ దృష్టి గుజరాత్‌లోని అహ్మదాబాద్ వస్త్ర మిల్లు కార్మికుల సమస్యపై పడింది. అప్పట్లో ప్లేగు మహమ్మారి విలయతాండవం చేయడంతో కార్మికులు ఊళ్లు విడిచి వెళ్లకుండా యాజమాన్యాలు ‘ప్లేగు బోనస్’ ఇచ్చేవి. అయితే వ్యాధి తగ్గుముఖం పట్టగానే ఆ బోనస్‌ను నిలిపివేయడానికి మిల్లు యజమానులు సిద్ధపడ్డారు. అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో, కనీసం ముప్పై ఐదు శాతం వేతన పెంపు ఇవ్వాలని కార్మికులు మొరపెట్టుకున్నారు. మిల్లు యజమానుల్లో ఒకరైన అంబాలాల్ సారాభాయ్ గాంధీజీకి సన్నిహిత మిత్రుడు మరియు ఆశ్రమానికి విరాళాలు ఇచ్చిన వ్యక్తి అయినప్పటికీ, ధర్మం కోసం గాంధీజీ కార్మికుల పక్షాన నిలిచారు. ఈ పోరాటంలో సారాభాయ్ సోదరి అనసూయా బెన్ కార్మికుల తరఫున గాంధీజీకి తోడుగా నిలవడం విశేషం.
కార్మికులు హింసకు తావులేకుండా సమ్మె కొనసాగించాలని గాంధీజీ ప్రతిజ్ఞ చేయించారు. అయితే రోజుల తరబడి సాగిన సమ్మె వల్ల కుటుంబాలు పస్తులుండటంతో కార్మికుల మనోధైర్యం సడలిపోసాగింది. కార్మికులలో ఆత్మవిశ్వాసం నింపడానికి, వారి బాధలో భాగస్వామి కావడానికి గాంధీజీ తొలిసారి భారత నేలపై ‘నిరాహార దీక్ష’కు దిగారు. నాయకుడే తమ కోసం అన్నపానీయాలు మాని ప్రాణత్యాగానికి సిద్ధపడటం చూసి కార్మికులు కన్నీటిపర్యంతమయ్యారు. గాంధీజీ నైతిక శక్తి ముందు మిల్లు యజమానులు దిగివచ్చి, మూడు రోజులకే కార్మికులు కోరిన ముప్పై ఐదు శాతం వేతన పెంపును అంగీకరించారు. కార్మిక వర్గ ఉద్యమాల్లో సత్యం, అహింస, నిరాహార దీక్షలు ఎంతటి శక్తిమంతమైన సాధనాలో ఈ ఉద్యమం రుజువు చేసింది.
ఖేడా రైతాంగ సత్యాగ్రహం – పన్నుల నిరాకరణ శంఖారావం
అహ్మదాబాద్ విజయం సాధించిన కొద్ది వారాలకే 1918 మార్చిలో గుజరాత్‌లోని ఖేడా జిల్లా రైతులు తీవ్ర సంక్షోభంలో పడ్డారు. అనావృష్టి కారణంగా పంటలు పూర్తిగా నాశనమై తీవ్ర దుర్భిక్షం ఏర్పడింది. బ్రిటిష్ రెవెన్యూ నిబంధనల ప్రకారం సాధారణ దిగుబడిలో ఇరవై ఐదు శాతం కంటే తక్కువ పంట వస్తే ఆ ఏడాది శిస్తు పూర్తిగా మాఫీ చేయాలి. కానీ పాలకుల దర్పం రైతుల వాస్తవ పరిస్థితిని గుర్తించకుండా బలవంతపు శిస్తు వసూళ్లకు దిగింది. రైతుల పశువులను, వ్యవసాయ పనిముట్లను, ఆఖరికి ఇంటి పాత్రలను కూడా వేలం వేస్తూ క్రూరంగా ప్రవర్తించారు.
ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి గాంధీజీ పిలుపునిచ్చారు. ప్రాణాలు పోయినా, ఆస్తులు కోల్పోయినా అక్రమ పన్నును ఒక్క పైసా కూడా చెల్లించవద్దని ఆయన రైతులకు ఉద్బోధించారు. ఈ ఉద్యమంలో గాంధీజీకి ఒక దృఢమైన సేనాపతి దొరికారు; ఆయనే గోద్రాకు చెందిన యువ న్యాయవాది వల్లభ్‌భాయ్ పటేల్. పటేల్ తన లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలి, గ్రామాలు తిరుగుతూ రైతుల్లో నిర్భయత్వాన్ని రగిలించారు. దాడులు, అరెస్టులు ఎదురైనా రైతులు తలవంచకుండా నిలబడటంతో బ్రిటిష్ సర్కారు వెనక్కి తగ్గింది. స్థోమత ఉన్నవారు మాత్రమే పన్ను చెల్లించవచ్చని, పేద రైతుల పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నామని రహస్య ఆదేశాలు జారీ చేసింది. ఇది భారత రైతాంగం సాధించిన తిరుగులేని ‘సహాయ నిరాకరణ’ విజయం.
విముక్తి బాటలో అవతరించిన ‘ మహాత్మా ‘
చంపారన్ ఉద్యమం రైతులకు దైర్యాన్ని నేర్పితే, అహ్మదాబాద్ కార్మికులలో నైతిక నిబద్ధతను పెంచింది; ఖేడా సత్యాగ్రహం ప్రజలలో ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచే నిశ్చయ సంకల్పాన్ని నింపింది. ఈ మూడు ఉద్యమాలు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి మొదటిసారిగా సామాన్య భారతీయుడి అహింసా శక్తిని పరిచయం చేశాయి. కోటు, బూట్లు వేసుకుని రాజధానుల్లో తీర్మానాలు చేసే రాజకీయాలకు కాలం చెల్లిందని, పల్లెల్లోని పేదల కన్నీళ్లను తుడవడమే అసలైన దేశభక్తి అని ఈ ఘట్టాలు నిరూపించాయి.
రైతులు, కూలీలు, కార్మికులు తమ ఆత్మబంధువుగా భావించిన ఆ నిరాడంబర మూర్తిని చూసి రవీంద్రనాథ్ ఠాగూర్ హృదయం ద్రవించి మోహన్‌దాస్ కరంచంద్ గాంధీని ఆప్యాయంగా ‘మహాత్మా’ అని సంబోధించారు. అక్టోబర్ 2న మనం స్మరించుకునే ఆ మహనీయుడి ప్రస్థానం .. భయంతో కూరుకుపోయిన ఒక నిస్సహాయ జాతికి ఆత్మగౌరవాన్ని నూరిపోసి, ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైన ప్రజాస్వామిక విప్లవానికి నాయకత్వం వహించడంగా ఘనతకెక్కింది.
